రాజమహేంద్రవరం: ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతూ ప్రజలకు తీవ్ర ఆర్థిక, మానసిక నష్టాలను కలిగిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాల నియంత్రణ, బాధితుల నగదు రికవరీ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
“జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సైబర్ మోసాల పెరుగుతున్న ప్రభావం, బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డిజిటల్ అరెస్ట్‌లు, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌లు, ఆన్లైన్ జాబ్ మోసాలు, UPI మోసాలు, సోషల్ మీడియా మోసాలు, OTP మరియు బ్యాంకింగ్ మోసాల వల్ల ప్రజలు భారీగా నష్టపోతున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సైబర్ నేరాల నియంత్రణలో అవగాహన కార్యక్రమాలు, 1930 హెల్ప్‌లైన్, సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ వంటి అంశాల్లో విశేష కృషి చేస్తున్నప్పటికీ, నగదు రికవరీ శాతాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
అధికారిక గణాంకాల ప్రకారం 2024 సంవత్సరంలో రాష్ట్రంలో సైబర్ మరియు ఆర్థిక మోసాల కారణంగా సుమారు రూ.974 కోట్లకు పైగా ప్రజలు నష్టపోయారని, వేలాది ఫిర్యాదులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అయితే బాధితులకు తిరిగి అందించిన నగదు శాతం ఇంకా తక్కువగా ఉండటంతో రికవరీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు.
వినతిపత్రంలో భాగంగా సైబర్ నేరాల దర్యాప్తులో సాంకేతిక నైపుణ్యాల పెంపు, గోల్డెన్ అవర్ స్పందన వ్యవస్థ, జిల్లా స్థాయి ప్రత్యేక సమీక్షలు, పెండింగ్ కేసుల పునఃపరిశీలన, త్రైమాసిక పారదర్శక నివేదికలు, బాధితులకు కేసు పురోగతి సమాచారం అందించే ప్రత్యేక వ్యవస్థ, ప్రజా అవగాహన కార్యక్రమాల విస్తరణ, డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులతో ప్రత్యేక సలహా బృందాల ఏర్పాటు వంటి పలు కీలక సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేతిరెడ్డి ఆదిత్య, బీజేవైఎం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పెరుమాళ్ళ పవన్ కుమార్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీవిద్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఆర్కే రాజు, యానపు యేసు, బండి ప్రసాద్, ఖండవల్లి సాయి, ముద్దుర్తి నాగభూషణం, పెదిరెడ్డి ఉమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

ప్రజల కష్టార్జిత ధనాన్ని రక్షించడం ప్రభుత్వాలు మరియు దర్యాప్తు సంస్థల బాధ్యత అని, సైబర్ నేరాలపై మరింత కఠిన చర్యలు తీసుకుని బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని నాయకులు కోరారు.









