హెచ్ సిటీ ప్రాజెక్టు, హైదరాబాద్ (Samachara News):
భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో చేపట్టిన హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ) ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని ముగ్ధ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న స్టీల్ ఫ్లైఓవర్ పనులను నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), మెఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నిర్మాణ ప్రాంతాన్ని పర్యవేక్షించిన ఆయన, ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రహదారుల వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యమన్నారు. ముఖ్యంగా కేబీఆర్ నేషనల్ పార్క్ పరిసరాల్లో సిగ్నల్-ఫ్రీ రాకపోకల కోసం రాబోయే రెండేళ్లలో మొత్తం ఏడు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించనున్నట్లు వెల్లడించారు.
జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం సమన్వయంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులను దశలవారీగా చేపడుతున్నామని తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచే ముగ్ధ జంక్షన్ నుంచి కేబీఆర్ పార్క్ వైపు వెళ్లే మార్గంలో ఆరు పిల్లర్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. పగటిపూట ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పనులను ప్రధానంగా రాత్రివేళల్లోనే కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
పునాది పనులు పూర్తయ్యే వరకు మాత్రమే కొద్దిపాటి అసౌకర్యం ఉంటుందని, అనంతరం వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు. ఈ ప్రతిష్టాత్మక హెచ్ సిటీ ప్రాజెక్టు పూర్తయితే కేబీఆర్ పరిసరాలు పూర్తిగా సిగ్నల్-ఫ్రీ జంక్షన్లుగా మారి సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాలకు సాఫీగా ప్రయాణించే వీలుంటుందని పేర్కొన్నారు.
నిర్మాణాల నేపథ్యంలో కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు తమ ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. రద్దీని తగ్గించేందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించాలని కోరారు. పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన మార్పులతో తాజా ట్రాఫిక్ అడ్వైజరీలను జారీ చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ (ట్రాఫిక్) డి. జోయల్ డెవీస్, జాయింట్ సీపీ (స్పెషల్ బ్రాంచ్) ఎస్.ఎం. విజయకుమార్, డీసీపీ (ట్రాఫిక్) శ్రీమతి కాజల్, జూబ్లీహిల్స్ డీసీపీ రమణారెడ్డి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, మెఘా ఇంజినీరింగ్ ప్రతినిధులు రాంబాబు (ఇంజినీర్), సుధాకర్ (ప్రాజెక్టు మేనేజర్) తదితరులు పాల్గొన్నారు.










