హైదరాబాద్, ఫిబ్రవరి 6: రెడ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల వరంగల్ లో జరిగిన బిసి సభలో మల్లన్న మాట్లాడుతూ.. రెడ్లపై తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, రెడ్డి సంఘాల నేతలు మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని.. కాంగ్రెస్ పార్టీ, అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై కూడా మల్లన్న ఘాటుగానే విమర్శలు చేశారు. ఈ క్రమంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ కోరింది. కులగణన నివేదికపై చేసిన వ్యాఖ్యలపై కూడా వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. తీన్మార్ మల్లన్న ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తన అభిప్రాయాలను పలు సందర్భాల్లో వెల్లడిరచారు.
ప్రభుత్వ కులగణన సర్వేపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దీంతో పాటు కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలపై కూడా పలు రకాల వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాంటి వ్యాఖ్యలు పార్టీలో విభేదాలు తేవడంతోపాటు ఆందోళనలు కలిగిస్తాయని భావించి నిర్ణయం తీసుకుంది. అంతేకాదు మల్లన్నకు అధికారికంగా నోటీసులు జారీ చేయకముందే కాంగ్రెస్ పార్టీ నోటీసుల గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఏమైనా విూ సొంతమా, కాంగ్రెస్ పార్టీ బీసీలదంటూ వ్యాఖ్యానించారు. పార్టీ పేరుతో తనను బెదిరించాలని చూస్తే కుదరదని హెచ్చరించారు. ఈ క్రమంలో బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, ఈ అంశంపై ప్రశ్నించని ఎమ్మెల్యేల పని ప్రజలే చూసుకుంటారని మల్లన్న వ్యాఖ్యానించారు.










