పోక్సో కేసులో నటుడు పరారీ

పోక్సో కేసులో పరారీలో ఉన్న మలయాళ నటుడు కేఆర్‌ జయచంద్రన్‌పై కేరళ పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశారంటూ ఆయనపై ఆరోపణలున్నాయి. గతేడాది కోజికోడ్‌లోని కసాబా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆయనపై కేసు నమోదైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక దాడి, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలను మోపారు. ఈ కేసులో అరెస్టు చేయకుండా జయచంద్రన్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అంతకు ముందు కోజికోడ్‌ సెషన్స్‌ కోర్టు సైతం బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ క్రమంలో జయచంద్రన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు కోజికోడ్‌ నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన పరారయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఆయన గురించి సమాచారం తెలిస్తే కోజికోడ్‌లోని కసబా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News