హైదరాబాద్ (Samachara News):
ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు కీలక సూచనలు చేస్తూ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
సజ్జనార్ మాట్లాడుతూ — “బెట్టింగ్ ఊబిలో పడొద్దు… బతుకును ఛిద్రం చేసుకోవద్దు” అని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వం చేపట్టిన #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది బెట్టింగ్ యాప్‌లను నిషేధించినప్పటికీ, ఇప్పుడు ఈ దందా కొత్త రూపంలో కొనసాగుతోందని తెలిపారు.
ప్రస్తుతం టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని హెచ్చరించారు. కొన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు డబ్బు కోసం ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఆన్‌లైన్ మాత్రమే కాకుండా, ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై కూడా పోలీసుల ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రజలు తమ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇందుకోసం డయల్ 100 లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబర్ 94906 16555 ద్వారా సమాచారాన్ని అందించవచ్చని తెలిపారు.
బెట్టింగ్ అనేది కేవలం ఒక ఆట కాదు, అది జీవితాలను నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనమని సజ్జనార్ హెచ్చరించారు. ముఖ్యంగా యువత ఈ మాయలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.









