దూకుడు పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

  • పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని ప్రకటన
  • కీలక పరిణామాలు ఉంటాయిన హెచ్చరికలు

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 3: బాధ్యతలు చేపట్టకముందు నుంచే పొరుగుదేశాలపై హెచ్చరికలతో కయ్యానికి కాలు దువ్విన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇప్పుడు అన్నంత పనీ చేసేలాగే కన్పిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలతో విరుచుకుపడిన ఆయన.. తాజాగా పనామా కాలువ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్న ట్రంప్‌ త్వరలోనే ఇందుకు సంబంధించి కీలక పరిణామాలు ఉంటాయన్నారు. బలవంతపు చర్యలు ఉండొచ్చనే సంకేతాలివ్వడం గమనార్హం. పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోంది. మేం దాన్ని చైనాకు ఇవ్వలేదు. కానీ, ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోంది. అందుకే కాలువను తిరిగి తీసుకోవాలనుకుంటున్నాం. లేదా త్వరలోనే దీనికి సంబంధించి శక్తిమంతమైన చర్య ఉండబోతోంది అని ట్రంప్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే, దీనికి బలగాల అవసరం ఉండకపోవచ్చని అన్నారు.

ఇదిలా ఉండగా.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆదివారం పనామా అధ్యక్షుడు జోస్‌రౌల్‌ ములినోతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ‘పనామా కాలువ విషయంలో చైనా జోక్యాన్ని, నియంత్రణను అడ్డుకోవాలి. లేదంటే వాషింగ్టన్‌ తగిన చర్యలు తీసుకుంటుంది‘ అని ములినోతో అగ్రరాజ్య విదేశాంగ మంత్రి గట్టిగా చెప్పారు. ఈ భేటీ అనంతరం పనామా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘అమెరికా దురాక్రమణకు మేం భయపడబోం‘ అని తెలిపారు. చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ నుంచి తాము వైదొలుగుతున్నట్లు పనామా అధ్యక్షుడు ప్రకటించారు. ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో ములినో నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌లో చేరేందుకు 2017లో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించబోమని ఆయన వెల్లడించారు.

పనామా కాలువను 1914లో అమెరికా నిర్మించింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు 1999 డిసెంబరులో దీన్ని పనామాకు ఇచ్చేసింది. అయితే, అమెరికా వాణిజ్య, నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని.. వీటిని తగ్గించాలని ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే ఆ కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఇరుదేశాల మధ్య వివాదం రాజుకుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News