కృష్ణుడి సేవలో.. తరించిన గోదాదేవి

శ్రీరంగం, జనవరి 11: మిగిలిన దేవతా కళ్యాణోత్సవాలతో పోలిస్తే గోదా రంగనాథుల కళ్యాణం ప్రత్యేకతకు రెండు కారణాలు ఉన్నాయి. గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి, ఆ ఆచరించిన దాన్ని మన దాకా ఆచరించేట్టుగా చేసింది అందుకే ‘పాడియరుళవల్ల పల్‌-వళై యాయ్‌‘ అని అంటుంటాం కదా. తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాక ఆచరించగలిగేట్టుగా ప్రబంధాన్ని అందించింది. అది గోదాదేవి గొప్పతనం. ఇది వరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేసారు కానీ వారు తరువాతి వారికి ఏమి అందించలేదు శ్రీకృష్ణుని అనుభవాన్ని పొంది ఊరుకున్నారు. గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆచరించాలో చెప్పింది. సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తనవంటి కదిలే రూపంలోనే వివాహ మాడారు వారి అవతారాల్లో. కానీ గోదా దేవి మానవకన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథున్ని వివాహమాడింది. తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేట్టు చేసుకుంది. ఇదే అమ్మవారి యొక్క గొప్పతనం.

మన ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని, అది దైవమని విశ్వసించి, మనం చెప్పినట్లుగా మనం పిలిచినట్లుగా అది కదల గలుగుతుంది, పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాళ్‌ తల్లి నిరూపించి చూపించింది. ‘ఉలగనిల్‌ తోత్రమాయ్‌ నిండ్ర శుడరే తుయిలెరాయ్‌‘, అంది అమ్మ అంటే లోకంలో కంటికి కనిపించేట్టుగా విగ్రహరూపంలొ ఉండే భగవంతుడా! ఆ విగ్రహ రూపంలో నీ ప్రభావము అనుపమానము, అసమానము అని విశ్వసిస్తున్నాను అని చెప్పి భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది. అంతే కాదు స్వామి విగ్రహరూపంలో ఉన్నా ఆయన్ని నిర్బందించి, బంధించి, ఆయన్ని పొందింది. అందుకే ఎక్కడో శ్రీవిల్లిపుత్తూరులో ఆంఢాళ్‌ ఉంటే, శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులని, రాజుని అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు. విగ్రహంలో ఉన్న స్వామితో వివాహమని తెలియగానే జనాలు తండోపతండాలుగా తరలి వచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీధికి చిత్రవీధి అనే పేరు ఏర్పడిపోయింది. తరువాత వీది ఉత్తరవీది, అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాహమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు.

మానవకన్యగా ఉన్న ఆండాళ్‌ తల్లిని ఉత్సవ మూర్తిగా మలచి తానూ ఉత్సవ మూర్తిగా కలిసి ఉన్నాడు. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు, మర్రి ఆకు విూద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి, ఆయనకు పెరియాళ్వారు అంటే – పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు ’కోదై’ అంటే – పూలమాల అన్నపేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది.

కళ్లుమూసినా, తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి, తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడిరది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ, ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు, ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి, గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ? అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు.

శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవినీ, విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి, అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి, విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News