ప్రముఖుల చిత్రాలతో వినూత్నంగా అసెంబ్లీ క్యాలెండర్‌

  • ఆవిష్కరించిన సిఎం చంద్రబాబు నాయుడు 

అమరావతి, డిసెంబర్‌ 28: రాజ్యంగ రచనలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖుల చిత్రాలు, చరిత్రను తెలిపేలా వినూత్నంగా రూపొందిచిన అసెంబ్లీ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుందని.. దీంతో ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వాములైన తెలుగు ప్రముఖులను స్మరించేలా క్యాలెండర్‌ రూపొందించినట్లు తెలిపారు. 2025 సంవత్సరానికి రూపొందించిన నూతన అసెంబ్లీ క్యాలెండర్‌ను తన నివాసంలో శనివారం సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. గోబ్యాక్‌ సైమన్‌ అంటూ తెగువ చూపిన ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు రాజ్యాంగ రచనలో భాగస్వామి కావడం గర్వకారణమని అన్నారు. రాజ్యాంగంలోని స్థానిక సంస్థలు, గవర్నర్‌ విచక్షణ అధికారాలు వంటి అంశాల రూపకల్పనలో సహాయ సహకారాలు టంగుటూరి ప్రకాశం పంతులు అందించారని చెప్పారు.

బోగరాజు పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ సభా సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా సేవలు అందించారని అన్నారు. దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ జాతీయ భాష, న్యాయవ్యవస్థ, స్వాతంత్యర్ర, మానవ అక్రమ రవాణాపై చేసిన కీలక సూచనలకు రాజ్యాంగ సభ ఆమోదం తెలిపిందని చెప్పారు. జాతీయ భాష గురించి మోటూరి సత్యనారాయణ, అధికార వికేంద్రీకరణ, అత్యవసర అధికారాలు రెండు సభలు ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుపై ఎన్జీ రంగా సూచనలు చేశారన్నారు. వీరితో పాటు వీసీ కేశవరావు, అల్లాడి కృష్ణస్వామి, మొసలికంటి తిరుమలరావు, కళా వెంకట్రావులు తమ వంతు సేవలు అందించారని గుర్తుచేశారు. ఇలాంటి వారి చిత్రపటాలతో అసెంబ్లీ క్యాలెండర్‌ను రూపొందించి ఆవిష్కరించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు, డిప్యూటి స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు తో పాటు అసెంబ్లీ సెక్రటెరీ జనరల్‌ సూర్యదేవర ప్రసన్న కుమార్‌ హాజరయ్యారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News