సిద్దిపేట, డిసెంబర్ 25: ఏసుక్రీస్తు ప్రబోధించిన ప్రేమ, కరుణ, శాంతి ఇతరుల పట్ల చూపించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. సిద్దిపేటలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏసు క్రీస్తు జన్మించిన డిసెంబర్ మాసం వచ్చిందంటే క్రైస్తవులందరికీ సంతోషంగా ఉంటుందని అన్నారు. ఈ క్రిస్మస్ మనందరికీ శాంతిని, సౌభ్రాతృత్వాన్ని, సహనాన్ని, క్షమాగుణాన్ని నేర్పుతుందని పేర్కొన్నారు. ఎదుటివారి పట్ల జాలి, దయ, క్షమాగుణం కలిగి ఉండాలని ఏసుక్రీస్తు ప్రబోధించారని హరీశ్‌రావు అన్నారు.
తోటివారిని ప్రేమించండి.. తోటి వారికి ఉపకారం చేయండి.. పది మందికి సహాయం చేసినపుడే నీ జన్మ ధన్యమవుతుందని ప్రభువు చెప్పారని తెలిపారు. తనను శిలువ వేసిన వారిని, తనను నానా మాటలు అన్నవారిని కూడా క్షమించండి అన్న గొప్ప దయామయుడు ఏసు క్రీస్తు అని కొనియాడారు. అందుకే ఏసుక్రీస్తు గొప్పతనాన్ని ప్రపంచమంతా గుర్తించిందని అన్నారు. దేశంలో క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా జరిపిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అని హరీశ్‌రావు కొనియాడారు. క్రిస్మస్ తెల్లవారి బాక్సింగ్ డే రోజు కూడా కేసీఆర్ సెలవుగా ప్రకటించారని గుర్తుచేశారు.
బతుకమ్మ పండుగకు హిందువులు, రంజాన్ పండుగకు ముస్లింలు, క్రిస్మస్ పండుగకు క్రైస్తవులు కొత్త బట్టలతో ఉండాలని కేసీఆర్ పదేళ్లపాటు తోఫాను అందించారని తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తు ఇప్పుడున్న ప్రభుత్వం ఆ తోఫాలను కొనసాగించకుండా ఆపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ అందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరియాలని, మీ కోరికలు, కలలన్నీ నిజం కావాలని ఆకాంక్షిస్తున్నానని హరీశ్‌రావు అన్నారు. మీ భవిష్యత్తు బంగారుమయం కావాలని, ఉజ్వలంగా ఉండాలని ఆ ఏసు ప్రభువును మనసారా ప్రార్థిస్తున్నానని తెలిపారు.
ఏసు ప్రభువు చెప్పిన విషయాలన్నింటినీ మనం జీవితంలో ఆచరించాలన్నారు. అప్పుడే అపుడే ఏసు ప్రభువు పట్ల మనం నిజమైన భక్తి చూపిన వారమవుతామని పేర్కొన్నారు.